All Islam Directory
1

దుమ్ము ఎగురవేసే వాటి (గాలుల) సాక్షిగా!

2

మరియు (నీటి) భారాన్ని మోసే (మేఘాల);

3

మరియు సముద్రంలో సులభంగా తేలియాడే (ఓడల);

4

మరియు (ఆయన) ఆజ్ఞతో (అనుగ్రహాలను) పంచిపెట్టే (దేవదూతల సాక్షిగా);

5

నిశ్చయంగా, మీకు చేయబడ్డ వాగ్దానం సత్యం.

6

మరియు నిశ్చయంగా తీర్పు రానున్నది.

7

మార్గాలతో నిండిన ఆకాశం సాక్షిగా!

8

నిశ్చయంగా, మీరు భేదాభిప్రాయాలలో పడి ఉన్నారు.

9

(సత్యం నుండి) మరలింపబడిన వాడే, మోసగింపబడిన వాడు.

10

ఆధారం లేని అభిప్రాయాలు గలవారే నాశనం చేయబడేవారు!

11

ఎవరైతే నిర్లక్ష్యంలో పడి అశ్రద్ధగా ఉన్నారో!

12

వారు ఇలా అడుగుతున్నారు: "తీర్పుదినం ఎప్పుడు రానున్నది?"

13

ఆ దినమున, వారు అగ్నితో దహింపబడతారు (పరీక్షింపబడతారు).

14

(వారితో ఇలా అనబడుతుంది): "మీ పరీక్షను రుచి చూడండి! మీరు దీని కొరకే తొందర పెట్టేవారు!"

15

నిశ్చయంగా, దైవభీతి గలవారు చెలమలు గల స్వర్గవనాలలో ఉంటారు.

16

తమ ప్రభువు తమకు ప్రసాదించిన వాటితో సంతోషపడుతూ! నిశ్చయంగా వారు అంతకు పూర్వం సజ్జనులై ఉండేవారు.

17

వారు రాత్రివేళలో చాలా తక్కువగా నిద్రపోయేవారు.

18

మరియు వారు రాత్రి చివరి ఘడియలలో క్షమాపణ వేడుకునే వారు.

19

మరియు వారి సంపదలో యాచించే వారికి మరియు ఆవశ్యకత గలవారికి హక్కు ఉంటుంది.

20

మరియు భూమిలో కూడా నమ్మేవారి కొరకు ఎన్నో నిదర్శనాలు (ఆయాత్) ఉన్నాయి.

21

మరియు స్వయంగా మీలో కూడా ఉన్నాయి. ఏమీ? మీరు చూడలేరా?

22

మరియు ఆకాశంలో మీ జీవనోపాధి మరియు మీకు వాగ్దానం చేయబడినది ఉంది.

23

కావున భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, ఇది సత్యం; ఏ విధంగానైతే మీరు మాట్లాడగలిగేది (సత్యమో)!

24

ఏమీ? ఇబ్రాహీమ్ యొక్క గౌరవనీయులైన అతిథుల గాథ నీకు చేరిందా?

25

వారు అతని వద్దకు వచ్చినపుడు: "మీకు సలాం!" అని అన్నారు. అతను: "మీకూ సలాం!" అని జవాబిచ్చి : "మీరు పరిచయం లేని (కొత్త) వారుగా ఉన్నారు." అని అన్నాడు.

26

తరువాత అతను తన ఇంటిలోకి పోయి బలిసిన (వేయించిన) ఒక ఆవు దూడను తీసుకొని వచ్చాడు.

27

దానిని వారి ముందుకు జరిపి: "ఏమీ? మీరెందుకు తినటం లేదు?" అని అడిగాడు.

28

(వారు తినకుండా ఉండటం చూసి), వారి నుండి భయపడ్డాడు. వారన్నారు: "భయపడకు!" మరియు వారు అతనికి జ్ఞానవంతుడైన కుమారుని శుభవార్తనిచ్చారు.

29

అప్పుడతని భార్య అరుస్తూ వారి ముందుకు వచ్చి, తన చేతిని నుదుటి మీద కొట్టుకుంటూ: "నేను ముసలిదాన్ని, గొడ్రాలను కదా!" అని అన్నది.

30

వారన్నారు: "నీ ప్రభువు ఇలాగే అన్నాడు! నిశ్చయంగా, ఆయన మహావివేకవంతుడు, సర్వజ్ఞుడు!"

31

(ఇబ్రాహీమ్) అడిగాడు: "ఓ సందేశహరులారా (ఓ దేవదూతలారా)! అయితే మీరు వచ్చిన కారణమేమిటి?"

32

వారన్నారు: "వాస్తవానికి, మేము నేరస్థులైన జనుల వైపునకు పంపబడ్డాము.

33

వారి మీద (కాల్చబడిన) మట్టి రాళ్ళను కురిపించటం కోసం!

34

నీ ప్రభువు తరఫు నుండి గుర్తు వేయబడిన (రాళ్ళు); మితిమీరి ప్రవర్తించేవారి కొరకు!"

35

అప్పుడు మేము అందులో ఉన్న విశ్వాసులందరినీ బయటికి తీశాము.

36

మేము అందు ఒక్క గృహం తప్ప! ఇతర విధేయుల (ముస్లింల) గృహాన్ని చూడలేదు.

37

మరియు బాధాకరమైన శిక్షకు భయపడేవారి కొరకు, మేము అక్కడ ఒక సూచన (ఆయత్) ను వదలి పెట్టాము.

38

ఇక మూసా (గాథలో) కూడా (ఒక సూచన వుంది) మేము అతనిని ఫిర్ఔన్ వద్దకు స్పష్టమైన ప్రమాణంతో పంపినపుడు;

39

అతడు (ఫిర్ఔన్) తన సభాసదులతో సహా మరలిపోతూ, ఇలా అన్నాడు: "ఇతడు మాంత్రికుడు లేదా పిచ్చివాడు!"

40

కావున మేము అతనిని మరియు అతని సైనికులను పట్టుకొని, వారందరినీ సముద్రంలో ముంచి వేశాము మరియు దానికి అతడే నిందితుడు.

41

ఇక ఆద్ జాతి వారిలో కూడా (ఒక సూచన వుంది): మేము వారిపై వినాశకరమైన గాలిని పంపినప్పుడు!

42

అది దేని పైనయితే వీచిందో, దానిని క్షీణింపజేయకుండా వదలలేదు.

43

మరియు సమూద్ జాతి వారి గాథలో కూడా (ఒక సూచన ఉంది). వారితో: "కొంతకాలం మీరు సుఖసంతోషాలను అనుభవించండి." అని అన్నాము.

44

అప్పుడు వారు తమ ప్రభువు ఆజ్ఞను ఉపేక్షించారు. కావున వారు చూస్తూ ఉండగానే ఒక పెద్ద పిడుగు వారి మీద విరుచుకు పడింది.

45

అప్పుడు వారికి లేచి నిలబడే శక్తి కూడా లేకపోయింది మరియు వారు తమను తాము కూడా కాపాడు కోలేక పోయారు.

46

మరియు దీనికి ముందు నూహ్ జాతి వారిని కూడా (నాశనం చేశాము). నిశ్చయంగా, వారు కూడా అవిధేయులు.

47

మరియు ఆకాశాన్ని మేము (మా) చేతులతో నిర్మించాము. మరియు నిశ్చయంగా, మేమే దానిని విస్తరింపజేయ గలవారము.

48

మరియు భూమిని మేము పరుపుగా చేశాము, మేమే చక్కగా పరిచేవారము!

49

మరియు మేము ప్రతిదానిని జంటలుగా సృష్టించాము, మీరు గ్రహించాలని.

50

కావున మీరు అల్లాహ్ వైపునకు పరుగెత్తండి. నిశ్చయంగా, నేను (ముహమ్మద్) ఆయన తరఫు నుండి మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే!

51

మరియు మీరు అల్లాహ్ కు సాటిగా ఇతర దైవాన్ని నిలుపకండి! నిశ్చయంగా, నేను (ముహమ్మద్) ఆయన తరఫు నుండి మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే!

52

ఇదే విధంగా, వారికి పూర్వం గడిచిన వారి వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు: "ఇతను మాంత్రికుడు లేదా పిచ్చివాడు." అని అనకుండా ఉండలేదు.

53

ఏమీ? దీనిని (ఇలా పలుకుటను) వారు ఒకరికొకరు వారసత్వంగా ఇచ్చుకున్నారా? అలా కాదు! అసలు వారు తలబిరుసుతనంతో ప్రవర్తించే జనం!

54

కావున నీవు వారి నుండి మరలిపో, ఇక నీపై ఎలాంటి నింద లేదు.

55

మరియు వారిని ఉపదేశిస్తూ వుండు, నిశ్చయంగా, ఉపదేశం విశ్వాసులకు ప్రయోజనకర మవుతుంది.

56

మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే!

57

నేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు మరియు వారు నాకు ఆహారం పెట్టాలని కూడా కోరటం లేదు.

58

నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే ఉపాధి ప్రదాత, మహా బలవంతుడు, స్థైర్యం గలవాడు.

59

కావున నిశ్చయంగా, దుర్మార్గానికి పాల్పడినవారి పాపాలు వారి (పూర్వ) స్నేహితుల పాపాల వంటివే! కావున వారు నా (శిక్ష కొరకు) తొందర పెట్టనవసరం లేదు!

60

కావున సత్యతిరస్కారులకు వినాశం గలదు - వారికి వాగ్దానం చేయబడిన - ఆ దినమున!