ఆల్ ఇస్లాం లైబ్రరీ

50 - The Letter "Qaf" - Qāf

:1

ఖాఫ్, మరియు దివ్యమైన ఈ ఖుర్ఆన్ సాక్షిగా!

:2

అలా కాదు! హెచ్చరిక చేసేవాడు, వారి వద్దకు వారిలో నుంచే వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది, కావున సత్యతిరస్కారులు ఇలా అన్నారు: "ఇది ఆశ్చర్యకరమైన విషయం!

:3

మేము మరణించి మట్టిగా మారి పోయినా (మరల బ్రతికించ బడతామా)? ఈ విధంగా మరల (సజీవులై) రావటం చాలా అసంభవమైన విషయం!"

:4

వాస్తవానికి వారి (శరీరాల)లో నుండి భూమి దేనిని తగ్గిస్తుందో మాకు బాగా తెలుసు. మరియు మా దగ్గర అంతా ఒక సురక్షితమైన గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.

:5

కాని వారు, సత్యం వారి వద్దకు వచ్చినపుడు దానిని అసత్యమని తిరస్కరించారు. కాబట్టి వారు ఈ విషయం గురించి కలవరపడుతున్నారు.

:6

వారు, తమ మీద ఉన్న ఆకాశం వైపునకు చూడటం లేదా ఏమిటి? మేము దానిని ఏ విధంగా నిర్మించి అలంకరించామో మరియు దానిలో ఎలాంటి చీలికలూ (పగుళ్ళూ) లేవు.

:7

ఇక భూమిని! మేము దానిని విస్తరింపజేసి, దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము. మరియు అందులో అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పత్తి చేశాము.

:8

(అల్లాహ్) వైపునకు మరలే ప్రతి దాసునికి సూచనగా మరియు బోధనగా!

:9

మరియు మేము ఆకాశం నుండి శుభదాయకమైన నీటిని కురిపించి దాని ద్వారా తోటలను ఉత్పత్తి చేశాము మరియు ధాన్యాలను పండించాము.

:10

మరియు ఎత్తయిన ఖర్జూరపు చెట్లను పెంచి, వాటికి వరుసలలో పండ్ల గుత్తులను (పుట్టించాము);

:11

మా దాసులకు జీవనోపాధిగా మరియు దానితో (ఆ నీటితో) చచ్చిన భూమికి ప్రాణం పోశాము. ఇదే విధంగా (చచ్చిన వారిని) కూడా లేపుతాము.

:12

వారికి పూర్వం నూహ్ జాతి వారు, అర్ రస్ వాసులు మరియు సమూద్ జాతి వారు కూడా, సత్యాన్ని తిరస్కరించారు.

:13

మరియు ఆద్ జాతి వారు, ఫిర్ఔన్ జాతి వారు మరియు లూత్ సహోదరులు కూడా;

:14

మరియు అయ్ కహ్ (వన) వాసులు మరియు తుబ్బఅ జాతి వారు కూడాను. ప్రతి ఒక్కరూ తమ ప్రవక్తలను అసత్యులని తిరస్కరించారు, కావున నా బెదరింపు వారి విషయంలో సత్యమయింది.

:15

ఏమిటి? మేము మొదటి సృష్టితోనే అలసిపోయామా? అలా కాదు, అసలు వారు కొత్త సృష్టి (పునరుత్థానమును) గురించి సందేహంలో పడి ఉన్నారు.

:16

మరియు వాస్తవంగా, మేమే మానవుణ్ణి సృష్టించాము మరియు అతని మనస్సులో మెదిలే ఊహలను కూడా మేము ఎరుగుతాము. మరియు మేము అతనికి అతని కంఠ రక్తనాళం కంటే కూడా అతి దగ్గరగా ఉన్నాము.

:17

(జ్ఞాపకముంచుకోండి) అతని కుడి మరియు ఎడమ ప్రక్కలలో కూర్చుండి (ప్రతి విషయాన్ని వ్రాసే) ఇద్దరు పర్యవేక్షకులు (దేవదూతలు) అతనిని కలుసుకొన్న తరువాత నుంచి -

:18

అతనితో బాటు ఒక పర్యవేక్షకుడైనా సిద్ధంగా లేనిదే - అతడు ఏ మాటనూ పలకలేడు.

:19

మరియు మరణ మూర్ఛ వచ్చేది సత్యం. అది, ఇదే! దేని నుండైతే నీవు తప్పించుకో గోరుతూ ఉండేవాడివో!

:20

మరియు బాకా (సూర్) ఊదబడుతుంది. ఆ హెచ్చరించబడిన (పునరుత్థాన) దినం అదే!

:21

మరియు ప్రతి ఆత్మ (ప్రాణి) ఒక తోలేవాడితో మరొక సాక్ష్యమిచ్చేవాడితో సహా వస్తుంది.

:22

(ఇలా అనబడుతుంది): "వాస్తవానికి నీవు (ఈ దినాన్ని గురించి) నిర్లక్ష్యంగా ఉండే వాడివి. కావున ఇపుడు మేము నీ ముందున్న తెరను తొలగించాము. కావున, ఈ రోజు నీ దృష్టి చాలా చురుకుగా ఉంది."

:23

మరియు అతని సహచరుడు (ఖరీనున్) ఇలా అంటాడు: "ఇదిగో నా దగ్గర సిద్ధంగా ఉన్న (ఇతని కర్మ పత్రం) ఇది!"

:24

(ఇలా ఆజ్ఞ వస్తుంది): "మూర్ఖపు పట్టు (హఠము) గల ప్రతి సత్యతిరస్కారుణ్ణి మీరిద్దరు కలసి నరకంలో విసరివేయండి;

:25

మంచిని నిషేధించే వాడిని, హద్దులు మీరి ప్రవర్తిస్తూ సందేహాలను వ్యాపింప జేసేవాడిని;

:26

అల్లాహ్ కు సాటిగా ఇతర ఆరాధ్య దైవాన్ని కల్పించినవాడు ఇతడే. కావున ఇతనిని మీరిద్దరూ కలిసి ఘోరశిక్షలో పడవేయండి."

:27

అతని స్నేహితుడు (ఖరీనున్) ఇలా అంటాడు: "ఓ మా ప్రభూ! నేను ఇతని తలబిరుసుతనాన్ని ప్రోత్సహించలేదు, కాని ఇతడే స్వయంగా, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళి పోయాడు."

:28

ఆయన (అల్లాహ్) ఇలా అంటాడు: "మీరు నా దగ్గర వాదులాడకండి మరియు వాస్తవానికి నేను ముందుగానే మీ వద్దకు హెచ్చరికను పంపి ఉన్నాను."

:29

నా దగ్గర మాట మార్చటం జరుగదు మరియు నేను నా దాసులకు అన్యాయం చేసేవాడను కాను.

:30

ఆ రోజు మేము నరకంతో: "నీవు నిండిపోయావా?" అని ప్రశ్నిస్తాము. మరియు అది: "ఇంకా ఏమైనా ఉందా ఏమిటి?" అని అడుగుతుంది.

:31

మరియు స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకురాబడుతుంది! అది వారి నుండి ఏ మాత్రం దూరంగా ఉండదు.

:32

(వారితో ఇలా అనబడుతుంది): "ఇదే మీకు వాగ్దానం చేయబడినది. మళ్ళీ మళ్ళీ మా వైపుకు మరలే ప్రతివానికి, (మా హద్దును) లక్ష్యపెట్టిన (పాటించిన) వానికి;

:33

అగోచరుడైన ఆ కరుణామయునికి భయపడేవానికి మరియు మా వైపునకు పశ్చాత్తాప హృదయంతో మరలేవానికి;

:34

ఇందులో (ఈ స్వర్గంలో), శాంతితో ప్రవేశించండి. ఇదే శాశ్వాత జీవిత దినం."

:35

అందులో వారికి, వారు కోరేదంతా ఉంటుంది. మరియు మా దగ్గర ఇంకా చాలా ఉంది.

:36

మరియు మేము, వీరికి పూర్వం ఎన్నో తరాల వారిని నాశనం చేశాము. వారు వీరి కంటే ఎక్కువ శక్తిమంతులు. కాని, (మా శిక్ష పడినప్పుడు) వారు దేశదిమ్మరులై పోయారు. ఏమీ? వారికి తప్పించుకునే మార్గం ఏదైనా దొరికిందా?

:37

నిశ్చయంగా, హృదయమున్న వాడికి, శ్రద్ధతో వినేవాడికి మరియు లక్ష్యపెట్టే వాడికి ఇందులో ఒక గుణపాఠముంది.

:38

మరియు వాస్తవంగా! మేము ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్ని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాము. కాని మాకు ఎలాంటి అలసట కలుగలేదు.

:39

కావున (ఓ ముహమ్మద్!) వారు పలికే మాటలకు సహనం వహించు మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన స్తోత్రాలు చెయ్యి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు కూడా;

:40

మరియు రాత్రి వేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు మరియు సాష్టాంగం (సజ్దా) చేసిన తరువాత కూడా స్తుతించు.

:41

మరియు చెవి యొగ్గి విను, చాటింపు చేసేవాడు అతి దగ్గరి నుంచే పిలిచే రోజున!

:42

ఆ రోజు మీరు ఒక భయంకర శబ్దం వినేది సత్యం. (గోరీలలో నుండి) బయటికి వచ్చే దినం అదే!

:43

నిశ్చయంగా, మేమే జీవనమిచ్చే వారం మరియు మేమే మరణింపజేసే వారం మరియు మీ అందరి మరలింపు మా వైపునకే జరుగుతుంది.

:44

ఆ రోజు భూమి చీలిపోయి వారందరూ పరుగిడుతూ బయటికి వస్తారు. అదే సమావేశ సమయం. అది మాకెంతో సులభం.

:45

వారనేది మాకు బాగా తెలుసు. నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేయలేవు. కావున నా హెచ్చరికకు భయపడే వాడికి మాత్రమే నీవు ఈ ఖుర్ఆన్ ద్వారా హితబోధ చెయ్యి.