All Islam Directory
1

అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు!

2

ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు.

3

మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, మరియు మార్గం చూపాడు!

4

మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు.

5

మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు.

6

మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు -

7

అల్లాహ్ కోరింది తప్ప! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు.

8

మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము.

9

కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు!

10

(అల్లాహ్ కు) భయపడే వాడు హితోపదేశాన్ని స్వీకరిస్తాడు.

11

మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు.

12

అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు.

13

అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు.

14

సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు.

15

మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు.

16

అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు;

17

కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది.

18

నిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది;

19

ఇబ్రాహీమ్ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో.